ఎన్డీయే కూటమి ఎన్నికల హామీలకు కట్టుబడి ఉంది

 


ఎన్డీయే కూటమి ఎన్నికల హామీలకు కట్టుబడి ఉంది

- 10 లక్షల కోట్లుతో వైయస్‌ఆర్‌సీపీ ఏపీకి అప్పుల భారం పెట్టింది

- సూర్యుడు పొద్దు పొడవకముందే పింఛన్లు అందిస్తున్నాం

- దీపావళి కానుకగా ఉచిత గ్యాస్‌ సిలెండర్‌ అందిస్తున్నాం

- సూపర్‌ సిక్స్‌ పథకాలన్నీ అమలు చేస్తాం

- మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌

ఎన్డీయే కూటమి గత ఎన్నికల నేపధ్యంలో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు) అన్నారు. ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని నెరవేరుస్తామన్నారు. మెయిన్‌ రోడ్డులోని హోటల్‌ జగదీశ్వరిలో కూటమి నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైకాపా ప్రభుత్వం రాష్ట్రానికి రూ. 10 లక్షల కోట్లు అప్పుల భారం మిగిల్చిందన్నారు. గత పాలనలో అప్పుల భారం తప్పితే రాష్ట్రాభివృద్ధి శూన్యమన్నారు. సూర్యుడు పొద్దు పొడవ ముందే పించన్లు అందచేస్తున్న ఘనత తమ కూటమి ప్రభుత్వానిదన్నారు. ఎన్నికల నేపధ్యంలో ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాల్లో ఒకటైన పెన్షన్‌ను ఒక్కసారిగా 1000 రూపాయిలు పెంచి ఇస్తున్నామన్నారు. గత జగన్‌ ప్రభుత్వం మాదిరి 1000 ఇస్తామని ఏడాదికి రూ. 250 చొప్పున తాము ఇవ్వలేదని గుర్తు చేశారు. గత పాలనలో ఒక కొత్త పెన్షన్‌ ఇచ్చిన దాఖలాలు లేవని, రేషన్‌ కార్డు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. కొత్త పింఛన్లు కోసం వెలాదిగా దరఖాస్తులు వస్తున్నాయన్నారు. దీపావళి సందర్భంగా ఉచిత గ్యాస్‌ సిలెండర్‌ అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. తెల్ల కార్డు, ఆధార్‌ కార్డు ఉన్నవారు పథకానికి అర్హులన్నారు. ఈ నెల 29వ తేదీన నుండి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మొదలవుతుందన్నారు. దీపావళి సందర్భంగా అక్టోబర్‌ 31 నుంచి ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకం ప్రారంభం కానుందన్నారు. ఇంటికి గ్యాస్‌ సిలెండర్‌ వచ్చిన తరువాత యదావిధిగా డబ్బులు చెల్లించిన రెండు రోజుల్లో అర్హుల ఖాతాల్లోకి సబ్సిడీ సొమ్ము జమ అవుతుందన్నారు. ఇక ఈ పథకం కింద ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా అందించనున్నామని తెలిపారు. అక్టోబర్‌ 31 నుంచి మార్చి నెలాఖరులోగా ఒక సిలిండర్‌.. అలాగే 2025 ఏప్రిల్‌ 1 నుంచి జులై వరకూ రెండో సిలిండర్‌.. జులై నుంచి నవంబర్‌ వరకూ మూడో సిలిండర్‌ ఉచితంగా అందిస్తామన్నారు. ఉచిత గ్యాస్‌ సిలెండర్‌ పథకంలో ఏమైనా సమస్యలు ఉంటే 1967 టోల్‌ ఫ్రీ నెంబర్‌ కాల్‌ చెయ్యాలని సూచించారు. ఆఫ్‌ లైన్‌లో కూడా ఇసుక తీసుకెళ్ళేలా చర్యలు తీసుకున్నామన్నారు. విద్యుత్‌ ఛార్జీలు పెంచమని చెప్పిన మాటకు తమ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సోలార్‌ పవర్‌ అభివృద్ధి చేసుకోవడంతో కరెంట్‌ చార్జీలు అదుపులోకి వస్తాయన్నారు. 4 నెలలు అయినా కడప ఎమ్మెల్యే జగన్‌ అసెంబ్లీ ముఖం చూశాడా..? అని విమర్శించారు. వాళ్ళా మమ్మిల్ని విమర్శించేందంటూ ధ్వజమెత్తారు. జగన్‌ చేసిన అన్యాయానికి అతని తల్లి, చెల్లి వాపోతున్నారని అన్నారు. మనం అడపడుచుని చాలా గౌరవంగా చూసుకుంటామని, తల్లి, చెల్లికి న్యాయం చెయ్యని జగన్‌ ప్రజలకు ఏమి న్యాయం చేస్తాడని ప్రశ్నించారు. నిర్మాణ రంగానికి, పేదవాడికి న్యాయం జరగడానికి ఉచిత ఇసుక విధానం ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. ఎన్నికల నేపధ్యంలో తాను యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్రకటించడం జరిగిందని, దానిలో భాగంగా ఈ నెల 26వ తేదీన తన పుట్టిన రోజు సందర్భంగా మెగా జాబ్‌ మేళా నిర్వహించామన్నారు. దానికి అనూహ్యమైన స్ఫందన వచ్చిందన్నారు. సుమారు 10 వేల మంది యువతీ యువకులు ఈ మెగా జాబ్‌ మేళాకు హాజరయ్యారని వివరించారు. జాబ్‌ మేళా విజయవంతం చేసిన అందరికీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ ధన్యవాదాలు తెలిపారు. మీడియా సమావేశంలో కూటమి నాయకులు కాశి నవీన్‌ కుమార్‌, బుడ్డిగ రాధా, ఉప్పులూరి జానకి రామయ్య, తవ్వా రాజా,  కిలపర్తి శ్రీనివాస్‌, మజ్జి రాంబాబు, కంటిపూడి శ్రీనివాస్‌, ద్వారా పార్వతి సుందరి, శెట్టి జగదీష్‌, మరుకుర్తి రవి యాదవ్‌, హరి బెనర్జీ, అడబాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.