కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై చొరవ చూపాలి


TV77తెలుగు  రాజమహేంద్రవరం :

జేఏసీ రాష్ట్ర చైర్మన్ కే సుమన్

తూర్పు గోదావరి జిల్లా జేఏసీ ఏర్పాటు.

రాష్ట్రంలోని కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం చొరవ చూపి,పరిష్కార మార్గాలు  చూపాలని ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ కే సుమన్ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం రాజమండ్రి లోని మున్సిపల్ కల్యాణ మండపంలో జిల్లా జేఏసీ ఇన్చార్జ్ కే ముకుంద రామ్ అధ్యక్షతన జరిగిన సభలో సుమన్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఉన్న కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల  సమస్యలు పరిష్కారం కాక అనేక ఇబ్బందులకు గురి అవుతూ చాలీచాలని వేతనాలతో కుటుంబాలను భారంగా నెట్టుకొని వస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కాంటాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత ఇతర ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించి ఉద్యోగులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

నూతన కమిటీ ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ జేఏసీ  తూర్పు గోదావరి జిల్లా నూతన కమిటీని  ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీలో జిల్లా చైర్మన్ గా కే ముకుంద రామ్, ప్రధాన కార్యదర్శిగా నల్లమిల్లి ఆది రెడ్డి , వైస్ చైర్మన్ గా  సి హెచ్ వి మురళి కృష్ణ, డి గణేష్,  పి దుర్గాప్రసాద్, డిప్యూటీ సెక్రటరీ గా ఏసుబాబు, జాయింట్ సెక్రటరీగా వెంకటరత్నం తో పాటు మరో 30 మందితో కమిటీ ఏర్పాటయింది. ఈ కమిటీ రెండు సంవత్సరాల పాటు కొనసాగుతుంది. నూతనంగా ఎంపికైన కమిటీ సభ్యులకు రాష్ట్ర చైర్మన్ నియామక పత్రాలు అందజేశారు. అనంతరం నూతన సభ్యులచే ప్రమాణ  స్వీకారం చేయించారు.ఈ కార్యక్రమంలో జిల్లాలోని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.