అలర్ట్.. ఎండాకాలం మొదలైపోయింది..!!


 తెలుగు రాష్ట్రాల్లో వేసవి కాలం వచ్చేసింది. క్రమంగా ఎండల తీవ్రత పెరుగుతోంది. ఏపీలో కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే 3.3 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదవుతోంది. సోమవారం తిరుపతిలో 37.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పలుచోట్ల ఉదయం 9 గంటలకే ఎండలు మండిపోతున్నాయి. అనంతపురం, కర్నూలు వంటి పట్టణాల్లో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు 36.6 డిగ్రీలకు చేరాయి. కడపలో 36.2, తూర్పుగోదావరి జిల్లా తునిలో 36.1, ప్రకాశం జిల్లా ఒంగోలులో 35.7, అమరావతిలో 35.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు తెలంగాణలో కూడా పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. పలుచోట్ల గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీలకు చేరింది. అయితే తెలంగాణలో పగటి ఉష్ణోగ్రలు పెరుగుతున్నా రాత్రిపూట చలి కూడా ఉంటుంది. అత్యల్పంగా ఆదిలాబాద్ లో 10 డిగ్రీలు, నిర్మల్ లో 12.3 డిగ్రీలు, సంగారెడ్డిలో 13.5 డిగ్రీలు, నిజామాబాద్‌లో 13.5 డిగ్రీలు, రంగారెడ్డిలో 13.8 డిగ్రీలు, జగిత్యాలలో 14.3 డిగ్రీలు, మెదక్‌లో 15 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటలకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి.