TV77తెలుగు పీలేరు:
చిత్తూరు జిల్లా, పీలేరు నియోజకవర్గం, కె.వి పల్లి మండలం, కె.వి పల్లి పంచాయతీ లోని జానంవారిపల్లి - లక్ష్మిరెడ్డిగారిపల్లి మధ్య తరతరాలుగా ఉన్న 1 కిలోమీటర్ ఉన్న పాత రోడ్డును కొంతమంది భూస్వాములు కొద్ది కొద్దిగా కబ్జా చేసేశారు. దీనివల్ల రోడ్డు లేక అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ పోయే దారి కూడా లేక కొంత మంది అనారోగ్యంతో చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. స్కూలు పిల్లలు కూడా స్కూల్ పోవాలంటే దారి లేకుండా ఉండేది. ఈ విషయమై జానంవారిపల్లి గ్రామస్తులు సంవత్సరం పైగా రెవెన్యూ ఆఫీసు చుట్టూ తిరగగా గతంలో కె.వి పల్లి తాసిల్దార్ గా పనిచేసిన శిరీష రోడ్డు నిర్మాణానికి ఆమోదం తెలపడంతో 90 శాతం రోడ్డును గ్రామములోని యువత గ్రామస్తులను ఏకం చేసి కలిసి శ్రమదానం తో పూర్తి చేసుకున్నారు. అలాగే గత సంవత్సరం ఏప్రిల్ 19వ తేదీన అప్పటి ఎస్ఐ రామ్ మోహన్ చేతుల మీదుగా లక్ష్మిరెడ్డిగారిపల్లి నుండి జానంవారిపల్లి కి పోయే రోడ్డు ముందు జానంవారిపల్లి అని సూచిక బోర్డును కూడా ప్రారంభించారు. కానీ అప్పటి తాసిల్దార్ బదిలీ పైన వెళ్లిపోయి కొత్త తాసిల్దార్ బదిలీపై వచ్చిన సందర్భంగా భూస్వాములు మళ్లీ పెండింగ్ లో ఉన్న 10 శాతం రోడ్డుని వేయకుండా మళ్లీ అడ్డుతగులుతున్న నేపథ్యంలో జానంవారిపల్లి గ్రామస్తులంతా ఏకమై తరతరాలుగా ఉంటున్న రోడ్డును తామే ఏర్పాటు చేసుకుంటామని శ్రమదానం తో పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు భూస్వాముల కూడా అడ్డు చెప్పక మౌనం వహించడంతో కథ సుఖాంతమైనట్లే. వీలైనంత తొందరలో సిమెంటు రోడ్డును కూడా వేయాలని అధికారులను జానంవారిపల్లి గ్రామస్తులు కోరుకుంటున్నారు.