సభ్యత్వంలో రాష్ట్రంలో మనమే ప్రధాన స్థానంలో నిలవాలి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌

 - సభ్యత్వంలో రాష్ట్రంలో మనమే ప్రధాన స్థానంలో నిలవాలి

- రూ. 5 లక్షల బీమా... మీ కుటుంబానికి ధీమా

- కార్యకర్తలకు అండగా ఉంటాం... ప్రతి సమస్య పరిష్కరిస్తాం

- మెగా జాబ్‌ మేళా విజయవంతం చేద్దాం

- ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌... టీడీపీ నేతలు పిలుపు

- సభ్యత్వ నమోదుపై అవగాహన కార్యక్రమం


తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదును ఉద్యమంగా చేపట్టాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు) పిలుపునిచ్చారు. స్థానిక మెయిన్‌ రోడ్డులోని హోటల్‌ జగదీశ్వరిలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై నాయకులు, మాజీ కార్పొరేటర్లు, క్లస్టర్‌ ఇన్‌ఛార్జ్‌లు, యూనిట్‌ సభ్యులు, బూత్‌ కన్వీనర్లకు నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డి మణేశ్వరావు అధ్యక్షతన అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ నుంచి నగరంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానుందన్నారు. సభ్యత్వ నమోదులో రాజమండ్రి సిటీ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ప్రధమ స్ధానంలో నిలపాలన్నారు. సభ్యత్వ నమోదును పకడ్బందీగా చేపట్టాలన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తనకు వచ్చిన మెజార్టీ స్థాయి కంటే రెట్టింపులోనే సభ్యత్వ నమోదు జరగాలన్నారు. ఆయా డివిజన్లలో జరిగే సభ్యత్వాలను బట్టే స్థానిక నాయకత్వం పట్ల తన స్పందన ఉంటుందని హెచ్చరించారు. నాయకులు, కార్యకర్తల అందరి సమస్యలు పరిష్కరిస్తామని, అందరూ సమిష్టిగా ఉంటూ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయాలన్నారు. సభ్యత్వ నమోదుకు సంబంధించిన కార్డులు ప్రతి పది రోజులకు ఒకసారి వస్తాయన్నారు. అలాగే శనివారం ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో జరిగే మెగా జాబ్‌ మేళాకు స్థానికంగా ఉన్న నిరుద్యోగ యువకులతో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యర్రా వేణు గోపాల రాయుడు, కార్యదర్శి కాశి నవీన్‌ కుమార్‌ తదితరులు మాట్లాడుతూ టీడీపీ సభ్యత్వం వల్ల కలిగే రూ. 5 లక్షల బీమా... మీ కుటుంబాలకు ధీమా అంటూ ప్రస్తావించారు. సభ్యత్వ నమోదులో మనమే ముందుండాలని పిలుపునిచ్చారు. గతంలో సభ్యత్వ నమోదు ఏ విధంగా జరిగేదో గుర్తు చేశారు. కాగా గత పాలనలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్రాన్ని, వ్యవస్థలను నాశనం చేశాడని మండిపడ్డారు. ఐదేళ్ల పాటు చీకటి రోజులు గడిచాయన్నారు. ఇప్పుడు చంద్రన్న పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. రాజమండ్రిలో ప్రతిష్టాత్మ అర్బన్‌ బ్యాంకులు ఆర్యాపురం, జాంపేటలతో పాటు ది రాజమండ్రి ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కూడా కూటమి కైవసం చేసుకుందన్నారు. కూటమికి అన్నీ శుభాలేనని, రానున్న రాజమహేంద్రవరం కార్పొరేషన్‌ ఎన్నికల్లో అందరూ కలిసి కట్టుగా పని చేసి నగర పరిధిలోని అన్ని డివిజన్లను కైవసం చేసుకుని 4వ సారి నగర పాలక సంస్థను కైవసం చేసుకుందామన్నారు. ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహానికి నేతలు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, వివిధ కమిటీల సభ్యులు, మాజీ కార్పొరేటర్లు, క్లస్టర్‌ ఇన్‌ఛార్జ్‌లు, యూనిట్‌ ఇన్‌ఛార్జ్‌లు, బూత్‌ కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు.