రాజమహేంద్రవరం నగరంలో ఉన్న అన్ని పార్కుల్లో సందర్శకుల అవసరార్ధం సౌకర్యాలు మెరుగుపరచాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) నగర పాలక సంస్థ అధికారులను ఆదేశించారు. స్థానిక 39వ డివిజన్ ఆర్యాపురంలోని ఏబీ నాగేశ్వరావు పార్కును స్థానిక నాయకులతో కలిసి సోమవారం సాయంత్రం పరిశీలించారు. పార్కు చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్కను వెంటనే తీయించాలని సూచించారు. దానితో పాటు పార్కునకు వచ్చే ప్రజలకు ఇబ్బంది లేకుండా పార్కు చుట్టూ అవసరమైన చోట హైమాక్స్ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని, నిత్యం పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని, మరుగు దొడ్ల నిర్వహణ చేపట్టాలని, పెరిగిపోయిన పిచ్చి మొక్కలను తొలగించాలన్నారు. మంచి నీటి కుళాయిలు ఏర్పాటు చేయాలని సూచించారు. చెత్తా చెదారం లేకుండా చూడాలని, అందుకు కావాల్సిన పారిశుద్ధ్య సిబ్బందిని నియమించాలన్నారు. గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లు రాత్రి సమయాల్లో పార్కు గోడలు దూకి లోపలికి ప్రవేశిస్తున్న నేపధ్యంలో పోలీసులు నిత్యం గస్తీ నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. పార్కును శుభ్రంగా ఉంచేందుకు కావాల్సిన అన్ని చర్యలు చేపట్టి పార్కునకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానిక నాయకులు ఆయన వెంట ఉన్నారు.