నేతలకు మమత బెనర్జీ లేఖ


 TV77తెలుగు  కోల్‌కతా:

 ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వ సంస్థలను బీజేపీ దుర్వినియోగపరుస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ ఆరోపించారు. బీజేపీపై పోరాటానికి ఏకతాటిపైకి రావాలని ప్రతిపక్షాలను కోరారు. ఈ మేరకు ఆమె వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, బీజేపీయేతర పార్టీల నేతలకు లేఖలు రాశారు.అసమ్మతి గళాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను నిరోధించేందుకు, జవాబుదారీని చేసేందుకు ప్రతిపక్షాలు ఏకమవాలని పిలుపునిచ్చారు. ఇది ప్రతిపక్షాలకుగల రాజ్యాంగపరమైన బాధ్యత అని వివరించారు. అందరికీ అనువుగా ఉండే చోట ప్రతిపక్షాల నేతలంతా సమావేశమవాలన్నారు. అణచివేతకు పాల్పడే ఈ  శక్తులతో పోరాడేందుకు దేశంలోని అభ్యుదయవాద శక్తులంతా కలిసి రావడం అత్యవసరమని చెప్పారు.  అధికారంలో ఉన్న బీజేపీ ఈ దేశ వ్యవస్థాగత ప్రజాస్వామ్యంపై ప్రత్యక్ష దాడికి పాల్పడుతోందని, దీనిపై తీవ్ర ఆందోళనను వ్యక్తం చేయడం కోసమే తాను ఈ లేఖలను రాస్తున్నానని తెలిపారు. దేశవ్యాప్తంగా రాజకీయ ప్రత్యర్థులపై కక్ష తీర్చుకోవడం కోసం ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్), సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ), సీవీసీ (సెంట్రల్ విజిలెన్స్ కమిషన్), ఆదాయపు పన్ను శాఖలను బీజేపీదుర్వినియోగపరుస్తోందని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో శుష్క పరిపాలన గురించి అద్భుతంగా చెప్పుకోవడం కోసం ఈ దర్యాప్తు సంస్థలను వినియోగించుకుంటోందన్నారు.