TV77తెలుగు రాజమహేంద్రవరం :
నగర అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళతాం
లేనిపోని ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు
మాజీ కార్పొరేటర్, వైకాపా సీనియర్‌నాయకుడు అజ్జరపు హెచ్చరిక
రాజమహేంద్రవరం
నిరంతరం నగర అభివృద్ధి కోసం కృషి చేస్తూ ప్రజల మన్ననలను పొందుతున్న ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ను చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడు ఆదిరెడ్డి వాసు ఆయనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మాజీ కార్పొరేటర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అజ్జరపు వాసు ఆరోపించారు. నగరంలోని ఆయన స్వగృహం వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అజ్జరపు వాసు తెలిపారు. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనివిధంగా ఈ మధ్య కాలంలో రాజమండ్రి రాజకీయాల్లో వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ఒక అలవాటుగా మారిపోయిందన్నారు. రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించిన నాటి నుంచి భరత్ రామ్ పై లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రచారం చేసేవారు ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. విద్యావంతుడు, సేవాతత్పరుడుగా పేరొందిన ఎంపీ మార్గాని భరత్‌రామ్ నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నారని, అయితే ప్రజల మన్ననలను చూసి ఓర్వలేక ఏదో కారణాన్ని చూసి ఆయన ప్రతిష్టను దెబ్బతీసేందుకు పెయిడ్ బ్యాచ్‌ని ఉపయోగించడం వాస్తవం కాదా? అని ఆదిరెడ్డి వాసును ప్రశ్నించారు. రాజమహేంద్రవరం నగరంలో చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేని వారు మాత్రమే ఈ వివాదాలకు పాల్పడుతున్నారని తెలిపారు. పదే పదే తన కుటుంబానికి అవినీతి మరక లేదని చెప్పుకోవడం చూస్తుంటే గురివింద గింజ సామెత గుర్తుకు వస్తుందని అన్నారు. ఆదిరెడ్డి వాసు తల్లిగారు మేయర్‌గా ఉన్న కాలంలో డీజిల్ కుంభకోణం ద్వారా అవినీతికి పాల్పడటం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. అలాగే నగర నడిబొడ్డున ఉన్న ఉల్లిపాయల మార్కెట్‌ను తరలించేందుకు ఏ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు మజ్జి రాంబాబును అడిగితే తేటతెల్లం అవుతుందని తెలిపారు. మహిళలకు అత్యంత గౌరవం ఇస్తామని చెబుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు తన ఇంటిలో ఎమ్మెల్యేగా ఉన్న మహిళ స్వేచ్ఛగా ప్రజల్లోకి వచ్చేందుకు అవకాశం కల్పిస్తే అప్పుడు మహిళల కోసం మాట్లాడేందుకు అవకాశం ఉందన్నారు. నగరంలో బ్లేడ్, గంజాయి బ్యాచ్‌లను పెంచి పోషిస్తున్నది ఎవ్వరో నగర ప్రజలందరికీ తెలుసునని అన్నారు. ఎంపీ మార్గాని భరత్‌రామ్ నగర ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు బ్లేడ్, గంజాయి బ్యాచ్‌లపై ప్రత్యేక దృష్టి సారించేలా ఇప్పటికే పోలీసుల అధికారులతో సమీక్షలు నిర్వహించడమే కాకుండా వారి పట్ల ఖఠినంగా ఉండాలని కోరడం జరిగిందని తెలిపారు. దాని ఫలితమే బ్లేడ్, గంజాయి బ్యాచ్‌లకు చెందిన వ్యక్తులపై కేసులు పెడుతున్నారని, ఇందుకు సంబంధించిన వివరాలు నగరంలో ఏ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా అందుబాటులో ఉంటాయని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో ఈ బ్యాచ్‌లకు చెందిన వ్యక్తులపై పెట్టిన కేసులు, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెట్టిన కేసుల వివరాలను కావాలంటే తామే సేకరించి ఇస్తామని చెప్పారు. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్‌లతో ఎటువంటి సంబంధం లేకుంటే ఆయా సంఘటనలపై ఎందుకు ప్రతిపక్ష పార్టీగా రోడ్డెక్కి పోరాటం చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. నగరంలో కుమ్మక్కు రాజకీయాలు ఆదిరెడ్డి కుటుంబానికే సొంతమని ఆరోపించారు. పదే పదే 30 వేలు మెజారిటీ అని గొప్పలు చెప్పుకుంటున్న ఆదిరెడ్డి వాసు ఆ మెజారిటీ సాధించడంలో కుమ్మక్కు రాజకీయాలు ఉన్నాయనేది నగర ప్రజలందరికీ తెలుసునని అన్నారు. ఆ మెజారిటీ మిమ్మలను చూసి కాదని గ్రహించుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో స్థానికంగా ఉన్న కొన్ని లోపాలు, తమ పార్టీలోని కొందరి నాయకులను కొనుగోలు చేయడం ద్వారా మాత్రమే ఆ మెజారిటీ వచ్చిందని ఆయన ఆరోపించారు. అలాగే ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి చల్లా శంకర్రావును గెలిపించేందుకు సొంత పార్టీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఏవిధంగా ఓడించి కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడ్డారో నగర ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలిసిన విషయమేనని తెలిపారు. ఏ అర్హత ఉందని ఎంపీ మార్గాని భరత్‌కు సవాల్ విసురుతున్నారని ప్రశ్నించారు. స్థాయిని మరచి సవాల్ చేయడం మానుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా తిరిగి గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గానికి వస్తారనే ఆందోళనతో అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ఎంపీ మార్గాని భరత్ రామ్‌పై అవాకులు, చవాకులను కట్టిపెట్టాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో వైకాపా నాయకులు కొత్త బాలమురళీకృష్ణ, చెక్క నవీన్, కాలెపు దొరబాబు, ద్వారా జగధీష్, నల్లం మహాగణేష్, వల్లూరి లోకేష్, తదితరులు పాల్గొన్నారు.