144 కోట్ల రూపాయల మేర ఆర్టీసీకి ఆదాయం


TV77తెలుగు విజయవాడ:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్  ద్వారకా తిరుమల రావు

 భోగి, సంక్రాంతి మరియు కనుమ పర్వదినముల సందర్భముగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులలో ప్రయాణించిన ప్రయాణికులందరికి మేనేజింగ్ డైరెక్టర్  ద్వారకా తిరుమల రావు ధన్యవాదములు తెలిపారు. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని బస్సులను 7 నుండి 18 వరకు నడుపుట వలన సంస్థకు 144 కోట్ల రూపాయల మేర ఆదాయం వచ్చినట్లు వివరించారు. పండుగ సందర్భముగా హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, విజయవాడ, విశాఖపట్నం, అమలాపురం, రాజమండ్రి, పాలకొండ, భీమవరం, కనిగిరి, గుడివాడ, మాచర్ల, నెల్లూరు, చిత్తూరు, పులివెందుల, నంద్యాల, కదిరి మొదలగు పట్టణాలకు 5422 ప్రత్యేక బస్సు లు నడిపినట్లు వివరించారు. ఇప్పటివరకు షుమారు 1350 బస్సులు ఆంధ్ర ప్రదేశ్ నుండి హైదరాబాద్ కు నడపగా, 4072 బస్సులు రాష్ట్రం లోని దూర ప్రాంతాలు, జిల్లా కేంద్రాలు,  అన్ని ముఖ్యమైన పట్టణాలకు బస్సులు నడిపినట్లు తెలిపారు. జనవరి 17న అత్యధిక సంఖ్యలో 36 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించుట వలన 15 కోట్ల 40 లక్షల రూపాయలు అత్యధిక ఆదాయము సమకూరినది. పొరుగు రాష్ట్రాలలోని విద్యాసంస్థలకు జనవరి 31 వరకు సెలవులు పొడిగించుటవలన ప్రయాణికుల అవసరాల మేరకు ప్రతి రోజు అన్ని జిల్లా కేంద్రాల నుండి ఇతర రాష్ట్రాలకు తగినన్ని బస్సులు ఏర్పాటు చేయబడుచున్నవి.  చెన్నై,బెంగుళూరుల నుండి కోవిడ్ థర్డ్ వేవ్ కారణంగా ప్రయాణీకుల సంఖ్య భారీగా తగ్గినది.  ఈ బస్సులన్నింటిలో ట్రాకింగ్ సదుపాయం కల్పించినందున మరియు 24 X 7 కాల్ సెంటర్ సేవల ద్వారా ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా, కోవిడ్ నిబంధనలు  పాటిస్తూ  వారి గమ్యస్థానములకు సకాలంలో సురక్షితముగా  చేరవేస్తునట్లు  తెలిపారు.