నిర్మల్ జిల్లా కేంద్రంలో చిన్నారిపై స్థానికంగా ఉండే వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. గోల్డెన్ ఫంక్షన్ హాల్ సమీపంలో ఈ దారుణం చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే ఓ కుటుంబానికి చెందిన మూడేళ్ల చిన్నారి తన తల్లి వద్దకు వెళ్లి అమ్మా చాలా నొప్పిగా ఉందంటూ బోరున ఏడ్చింది. కంగారు పడిన తల్లి ఏమైందమ్మా అని అడుగ్గా జరిగిందంతా చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
ఫంక్షన్ హాల్ సమీపంలో చిన్నారి.ఇద్దరు బాలికలతో ఆడుకుంటుండగా స్థానికంగా నివాసముండే నారాయణ (45) అక్కడకు వచ్చాడు.చాక్లెట్ ఇస్తానని చెప్పి ఆమెను అక్కడి నుంచి తీసుకు వెళ్లాడు.సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి చిన్నారిపై అత్యాచారం చేయబోయాడు. చిన్నారి ఏడవడంతో అక్కడే ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. ఇంటి దగ్గర్లోని ప్రదేశం కావడంతో చిన్నారి క్షేమంగా ఇంటికి చేరుకుంది. చాలా నొప్పిగా ఉందని ఏడుస్తూ తల్లికి జరిగిందంతా చెప్పింది.విషయాన్ని గ్రహించిన చిన్నారి కుటుంబీకులు, బంధువులు నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పజెప్పారు. ఈ విషయం పట్టణమంతా తెలిసిపోవడంతో వారందరూ పోలీసు స్టేషన్కు వచ్చి ఆందోళనకు దిగారు. నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు.