ఎయిడెడ్ విద్యా సంస్థలు కొనసాగించాలి జిఒ 42 రద్దు చేయాలి కాశి నవీన్

TV77తెలుగు రాజమహేంద్రవరం:
ఎయిడెడ్ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థుల భవిష్యత్తును వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అంధకారమయం చేస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్ కుమార్ అన్నారు.ఎయిడెడ్ విద్యా సంస్థలను విలీనం చేస్తామన్న ప్రభుత్వ ఆలోచనతో బడిలో ఉండాల్సిన విద్యార్థులు రోడ్డెక్కారని పేర్కొన్నారు. ఎయిడెడ్ విద్యా సంస్థలకు సహకారం నిలిపివేయాలన్న ప్రభుత్వ నిర్ణయం పేద విద్యార్ధుల పాలిట శాపంగా మారిందని ధ్వజమెత్తారు.విద్యార్థుల భవిష్యత్తు కోసం జగన్ సర్కారు ఆలోచించకుండా వారిని ఇబ్బందులకు గురి చేయడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం చేస్తున్న ప్రజా విరుద్దమైన ఆలోచనలకు ప్రజలు విశాఖ,కాకినాడలో ఏ విధంగా తిరుగుబాటు చేశారో రాష్ట్రమంతా చూశారని అన్నారు.చివరకు ప్రభుత్వం ఇస్తున్న పధకాలు తమకు వద్దని,బడులు కొనసాగించాలని విద్యార్థులు, వారి తలిదండ్రులు రోడ్లెక్కి విజ్ఞప్తి చేస్తున్నారని పేర్కొన్నారు. సిఎం జగన్ ఎయిడెడ్ విద్యా సంస్థల మూసివేతపై పునరాలోచన చేయాలని, ఎయిడెడ్ విద్యా సంస్థల విలీనానికి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జివో 42ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.లేకుంటే దీనిపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు పిలుపు మేరకు ఆందోళనలు చేపడతామన్నారు.