కృష్ణం వందే జగద్గురుమ్
abuztua 30, 2021
"వసుదేవ సుతం దేవం కంసచాణూర మర్దనమ్
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్”
శ్రావణ కృష్ణ పక్ష అష్టమి ”కృష్ణాష్టమి పర్వదినం. శ్రీ కృష్ణుడు పుట్టి పర్వదినం కావడంతో దీనిని ”జన్మాష్టమి” అని, కృష్ణుడు బాల్యంలో గోకులమున పెరిగినందున ”గోకులాష్టమి” అని, ”కృష్ణ జయంతి”, ”శ్రీ జయంతి” అని ఈ పర్వదినానికి పేర్లు ఉన్నాయి.భక్తుల కోర్కెలు తీర్చే క్రమంలో భగవంతుడు రెండు రకాల విధానాలను అనుసరిస్తాడు. సర్వం తానే స్వయంగా నిర్వహంచి, తనపై మనకున్న నమ్మకాన్ని పెంచుకోవడం మొదటి పద్ధతి. మన ప్రయత్నంలో రహస్యంగా సహకరించి, మనపై మన కు నమ్మకాన్ని పెంచి విజేతలుగా తీర్చిదిద్దడం రెండో పద్ధతి. ఇందు లో మొదటి దాన్ని దైవికం అని, రెండోదాన్ని పౌరుషం అని శాస్త్రం నిర్వచించింది.పరమాత్మ ప్రతి అవతారంలో ఏదో ఒక మార్గాన్నే ఎంచుకు న్నాడు. కానీ కృష్ణావతారంలో మాత్రం రెండు విధాలుగానూ దర్శ నమిస్తాడు. దుష్టశిక్షణ, శిష్ట రక్షణల్లో భాగవతంలోని కృష్ణుడు ఎవరి సహాయాన్నీ కోరలేదు. స్వయంగా తానే అవతార లక్ష్యం దిశగా సాగిపోయాడు. భారతంలోని కృష్ణుడు మాత్రం రెండో పద్ధ తి అనుసరించాడు. చేసిందంతా తానే అయినా ఘనతను మాత్రం పూర్తిగా పాండవుల పరం చేశాడు. వారిని విజేతలుగా నిలబెట్టాడు.
శ్రీకృష్ణ భగవానుడు ద్వాపర కలియుగ సంధికాలంలో శ్రీము ఖ నామ సంవత్సరంలో శ్రావణ మాసంలో బహుళ పక్షంలో రోహణి నక్షత్రంతో కూడిన అష్టమినాడు రెండు యామముల రాత్రి సమయాన కంసుని కారాగారంలో, దేవకికి 8వ గర్భంగా మేనమామ గండాన జన్మించాడు. కృష్ణాష్టమి ఒక గొప్ప పవిత్ర దినంగా పరిగణించ బడుతుంది. ఉపవాస పూజా జాగరణల ముఖ్య దినాలలో ఒకటి. బాలింతరాళ్ళకు తినిపించే కాయం, నైవేద్యం పెట్టడం అనగానే తల్లులకు ప్రియమై, మాతృ హృదయా లలో మమతను పెంపొందించే పండుగ, కృష్ణుని బాల్య చేష్టలను జ్ఞప్తికి తెస్తుంది. పాపపుణ్యాల వాసనే లేని బ్రహ్మ స్వరూపపు బాల ల్లో ద్యోతకమయ్యే దివ్యత్వాన్ని తేటపరిచే పర్వం కృష్ణాష్టమి.
యోగీశ్వరుడు, లీలా మానుష విగ్రహుడు, రాజకీయ దురం ధరుడు, పరమాత్ముడు, గీతా ప్రవక్తయైన కృష్ణుడు నిర్యాణం చెం దిన దినమే కలియుగ ప్రారంభ దినంగా పేర్కొంటారు. వర్తమాన కలియుగం క్రీస్తుపూర్వం 3102 ఫిబ్రవరి 20వ తేదీ 2 గంటల 27 నిమిషాల 30 సెకండ్ల కాలమున ప్రారంభమైనదని నిర్ధారించి, ప్రపంచ శాస్త్రజ్ఞుల కన్నా మేధావులమని నిరూపించారు భారత ఖగోళ శాస్త్రవేత్తలు. అంటే 5,123 ఏళ్ల క్రితం కలియుగం ప్రారం భమైనట్టు చెబుతారు.మహా విష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా జన్మించిన ఉట్ల పండుగ అని కూడా పిలువబడే జన్మాష్టమిని గురించి తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమాచార్యు డు. ”పైకొని చూడరె వుట్ల పండుగ నేడు ఆకడ గొల్లెతకు ననంద ము నేడు అడర శ్రావణ బహుళాష్టమి నేడితడు నడిరేయి జని యించి నాడు చూడ గదరే” అని వర్ణించాడు.కృష్ణ చరిత్రకు 8వ సంఖ్య సన్నిహత సంబంధముంది. ఆయ న పుట్టింది 8వ తిథి. దశావతారాలలో 8వ అవతారం. ఆయన వసు దేవుని 8వ సంతానం. ఆయనకు 8మంది పట్టపు రాణులు. 8చే గుణింపబడే పద హారు వేల గోపికల మనోహరుడు. అలాగే అష్ట భార్యల వల్ల ఆయనకు కలిగిన సంతాన 80 మంది.కృష్ణాష్టమి భక్తులకు ఉపవాస దినం. కృష్ణా ష్టమి పూజలో భాగంగా గుమ్మం దగ్గరి నుంచి. పూజ మంట పం వరకు శ్రీ కృష్ణ పాదాలను వేస్తుంటారు. ఇలా చేయడం వల్ల తమ ఇంట్లోకి సుఖ సంతోషాలు ప్రవేశిస్తా యని నమ్ముతారు. బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ, పళ్ళు స్వామికి నివేదించి, ఉయ్యాల కట్టి అందులో కృష్ణ మూర్తిని పరుండబెట్టి ఊపుతూ పాటలు, కీర్తనలు పాడు తారు. శ్రీకృష్ణ జయంతి వ్రతాచరణ ద్వారా గోదానం చేసిన, కురు క్షేత్రంలో సువర్ణ దానం చేసిన ఫలాలు దక్కగల వని, పుణ్యప్రద మని బ్రహ్మాండ పురాణం వివరిస్తున్నది. మహాభారత యుద్ధాన్ని ముందుండి నడిపిన మార్గదర్శి, దుష్ట శిక్షణ.శిష్ట రక్షణ అన్న గీతోపదేశంతో మానవాళికి దిశా నిర్దేశం చేసింది కృష్ణ భగవానుడే. శ్రీమత్ మహా భాగవతం జీవిత విలువల ను బోధిస్తూ, ఇప్పటికీ మార్గదర్శనం చేయడం ద్వారా శ్రీకృష్ణ మహోన్నత వ్యక్తిత్వానికి దర్పణం పడుతుంది.కృష్ణాష్టమి రోజు భగవానుని పూజించడమే కాదు, అయన లోని కొన్ని అయినా మంచి లక్షణాలని అలవర్చుకోవాలి. ప్రతి విషయంలోనూ స్వార్ధం, ఈర్ష్య, అసూయలను కొంతైన విడనాడి.మానవజన్మకు సార్ధకతను ఏర్పరచుకోవాలి. శ్రీకృష్ణుడు చేసిన అన్ని పనులలోను అర్థం పరమార్థం కనిపిస్తాయి. శ్రీకృష్ణుడు జగ ద్గురువు.”కృష్ణస్తు భగవాన్ స్వయమ్’.కృష్ణుడే పరమ తత్త్వం. చరమ లక్ష్యం… ఆయన గురించి చదవడం, చెప్పడం, పాడడం, వినడం. అన్నీ అపురూపమైన అనుభవాలే. ‘నీలో లేని చోద్యాలు ఈ ప్రపంచంలో ఏం ఉంటాయి?’ అని అక్రూరుడన్నా.‘అటువైపు కృష్ణుడున్నాడు.ఇటువైపు ఎవరున్నారు’ అని సంజయుడు హెచ్చరించినా. అవన్నీ పరమాత్మ విరాట్ రూపాన్ని విశదీకరిం చే ఉదా హరణలే. క్రియ, బోధ కలగలిసిన అద్భుత తత్త్వం ఆయన ది. యుగావసరాలకు అన్వయించుకో తగ్గ మహాగాథ శ్రీకృష్ణుడిది.గోప బాలకుడిగా, సోదరునిగా, అసుర సంహారిగా, ధర్మ సంరక్షకుడిగా ఎన్నో రకాల పాత్రలు పోషిం చాడు. అవన్నీ లోక కల్యాణం కోసమే.......