ఆదేశాల అమలు ఇలాగేనా?
abuztua 05, 2021
TV 77 NEWS : గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేసిన పనులకు బిల్లుల చెల్లింపుల్లో రాష్ట్రప్రభుత్వ వ్యవహార శైలిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం తీరు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాలను సర్కారు తేలిగ్గా తీసుకుంటుందని అసహనం వ్యక్తం చేసింది. నెలరోజుల్లో బిల్లులు చెల్లించాలని గతేడాది జనవరి 8న కోర్టు ఆదేశించినా ఇప్పటివరకు ఎందుకు అమలు చేయలేదని ప్రభుత్వాన్ని నిలదీసింది. కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉంటే... హైకోర్టు ఆదేశాలను నిలుపుదల చేయాలని సుప్రీంకోర్టులో అప్పీల్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించింది. ఉపాధి పనుల్లో కొన్నిచోట్ల అక్రమాలు జరిగాయనే కారణంతో అన్ని పనుల్లోనూ 20శాతం కోత విధించడం ఏంటని నిలదీసింది. విజిలెన్స్ ఎంక్వైరీలో ఏంతేలిందని పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, కమిషనర్ గిరిజాశంకర్‌ను ప్రశ్నించింది. వారు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. విజిలెన్స్ నివేదికను అధ్యయనం చేయకుండా విచారణకు హాజరుకావడం ఏంటని నిలదీసింది.
మరోవైపు బుధవారం విచారణకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రాకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలు గౌరవించేది ఇలాగేనాఅంటూ సూటిగా ప్రశ్నించింది. హాజరు నుంచి మినహాయింపు కోరుతూ వేసిన అఫిడవిట్‌లో సైతం కారణాలు పేర్కొనకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేసింది. రాష్ట్ర ప్రభు త్వం తరఫున అడ్వకేట్ జనరల్ స్పందిస్తూ... ధర్మాసనం ఆదేశాలను అమలు చేయడం మొదలుపెట్టామని.. కేంద్రం నిధులు రావాల్సి ఉందని...నాలుగు వారాల్లో పూర్తిగా బకాయిలను చెల్లిస్తామన్నారు. ధర్మాసనం స్పందిస్తూ... ప్రభుత్వం చెప్పే లెక్కలు వినేందుకు తాము సిద్ధంగా లేమని పేర్కొంది. చెల్లింపుల పురోగతిపై తమకు ఆసక్తి లేదని... కోర్టు ఆదేశాలు అమలు చేశారా? లేదా? అనేదే ముఖ్యమని స్పష్టం చేసింది. తాము చర్యలకు ఉపక్రమించేందుకు సమయం ఆసన్నమైందని ఘాటుగా వ్యాఖ్యానించింది. విచారణను 18కి వాయిదా వేసింది. ఆ రోజు పంచాయతీ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి తప్పక హాజరుకావాలని, కోర్టు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది. లేదంటే కోర్టు ధిక్కరణ కింద చర్యలు ప్రారంభిస్తామని తేల్చిచెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూ్‌పకుమార్ గోస్వామి, జస్టిస్ ఎన్. జయసూర్యతో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది.
గ్రామాలవారీగా లెక్కలు కోరాలి
ఉపాధి హామీ పథకం కింద 2019 జూన్ 1 లోపు నిర్వహించిన పనులకు మెటీరియల్ కాంపోనెంట్ కింద ఖర్చుచేసిన సొమ్ము బకాయిలను రాష్ట్రప్రభుత్వం చెల్లించకపోవడాన్ని సవాల్ చేస్తూ పలు వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలు బుధవారం ధర్మాసనం ముందుకు మరోసారి విచారణకు వచ్చాయి. బుధవారం జరిగిన విచారణలో పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, పంచాయతీరాజ్ కమిషనర్ కోర్టుముందు హాజరయ్యారు. హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.ఎస్ రావత్ డిస్పెన్స్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు దమ్మాలపాటి శ్రీనివాస్, వీరారెడ్డి, న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ‘‘రూ.5లక్షలలోపు విలువ చేసే పనుల్లో బిల్లులు చెల్లించేందుకు రూ. 870 కోట్లు విడుదలకు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ జారీ చేశామని ప్రభుత్వం కోర్టుకు చెప్పింది. నెలాఖరులోగా బిల్లులు చెల్లిస్తామని జూలై 15న కోర్టుకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు. రూ.413కోట్లు గ్రామపంచాయతీల ఖాతాల్లో జమచేశామని చెబుతున్నప్పటికీ మాకున్న సమాచారం మేరకు కేవలం రూ.40 కోట్లు మాత్రమే విడుదలచేశారు. ఏఏ గ్రామాలకు ఎంత మొత్తం జమ చేశారో అఫిడవిట్ దాఖలుచేసేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వండి. బిల్లుల చెల్లింపుల్లో పాత బకాయిలకు ప్రాధాన్యతనివ్వాలని 2019 ఏప్రిల్ 9న కేంద్రం ప్రొసీడింగ్స్ ఇచ్చింది’’ అని వాదించారు.
క్షమాపణ కోరిన ఎస్‌జీపీ
ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సి.సుమన్ వాదనలు వినిపిస్తూ... ‘‘మెటీరియల్ కాంపోనెంట్ కింద రూ.1794బకాయిలు చెల్లించాల్సిఉంది. బిల్లుల్లో విజిలెన్స్ నివేదిక ఆధారంగా 20శాతం కోత విధించాం. రూ.5లక్షలలోపు పనులకు రూ.413 కోట్లను జూలై 31న గ్రామపంచాయతీల అకౌంట్లలో జమచేశాం. రూ.5లక్షలు పైబడిన రూ.1,117కోట్ల విలువైన పనులకుగాను కేంద్రం నుంచి నిధులు వచ్చిన వెంటనే 4వారాల్లో చెల్లిస్తాం’’ అని వివరించారు. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి కోర్టుకు హాజరు కాకపోవడంపై కోర్టుకు ఎస్‌జీపీ క్షమాపణలు చెప్పారు. సమావేశం నిమిత్తం ఆర్థిక కార్యదర్శి ఢిల్లీ వెళ్లారని, తదుపరి విచారణకు హాజరవుతారని నివేదించారు.