రాష్ట్రంలో విద్యుత్‌ రంగానికి మహర్ధశ : ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌


రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్‌ రంగానికి మహర్దశ ప్రారంభమైందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. మహారత్నలో ఒక్కటైన ఎన్టీపీసీ సంస్థ తన ‘ఎన్టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌’ ఆధ్వర్యాన ఈ రంగంలో భారీ పెట్టుబుడులు పెట్టేందుకు ముందుకొచ్చిందని, ఈ మేరకు ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన న్యూ అండ్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ) - ఎన్టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ (ఎన్జీఈఎల్‌) మధ్య ఒప్పందం జరిగిందని తెలిపారు. ఈ ఒప్పందం అమలులోకి రావడం ద్వారా రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన  ప్రాజెక్టులు నెలకొల్పేందుకు రూ. 1,87,000 కోట్ల పెట్టుబడి ఎన్జీఈఎల్‌ పెట్టనుందని, దీని ద్వారా  దాదాపు రాష్ట్రంలో 1,06,250 మందికి ఉద్యోగ,  ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామి చేసే విధంగా చంద్రబాబు నాయనడు అడుగులు వేస్తున్నారన్నారు. సౌర, పవన, పంప్డ్‌ స్టోరేజీ, గ్రీన్‌ హైడ్రోజన్‌, గ్రీన్‌ అమ్మోనియా వంటి పునరుత్పాదక విద్యుత్‌ రంగ ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఈ జాయింట్‌ వెంచర్‌తో పెద్దఎత్తున నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు రావడమే కాకుండా, ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాల రూపురేఖలు మారతాయని పేర్కొన్నారు. గత వైకాపా పాలనలో రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు వేరే రాష్ట్రాలకు తరలిపోవడం చూశామని, కూటమి ప్రభుత్వం వచ్చిన 5 నెలల్లోనే లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు కార్పొరేట్‌ సంస్థలు మన రాష్ట్రం వైపు చూస్తున్నాయని పేర్కొన్నారు. గత జగన్‌ ప్రభుత్వం ఎప్పుడూ విద్యుత్‌ ఛార్జీలను పెంచడంపైనే దృష్టి సారించింది తప్పితే రాష్ట్రానికి, ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు ఏనాడు చేయలేదన్నారు. తమ కూటమి ప్రభుత్వం  తీసుకునే నిర్ణయాలన్నీ రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసమేనని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ పేర్కొన్నారు.