గోదావరికి వరదలు వచ్చినా ప్రజలకు నిరంతరాయం మంచినీటి సరఫరా:ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్

 



హెడ్ వాటర్ వర్క్స్ లో 150 హెచ్పి వర్టికల్ టర్బైన్ మోటర్ ఇన్స్టాలేషన్ పనులు పరిశీలన

రాజమహేంద్రవరం

గోదావరి వరదలు వచ్చే సమయంలో కూడా నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతరాయం మంచినీటి సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నామని, అందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) పేర్కొన్నారు. స్థానిక గోదావరి గట్టును ఉన్న హెడ్ వాటర్ వర్క్స్ లో జరుగుతున్న 150 హెచ్పి వర్టికల్ టర్బైన్ హెవీ మోటర్ ఇన్స్టాలేషన్ పనులను శనివారం స్థానిక నాయకులు, అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో హెడ్‌ వాటర్‌ వర్క్స్‌లో 100 హెచ్‌పి, 60 హెచ్‌పి, 40 హెచ్‌పి ఇలా మొత్తం 10 మోటార్లు ఉండేవన్నారు. 100 హెచ్‌పి గంటకు 7 లక్షల లీటర్ల రా వాటర్‌, 60 హెచ్‌పి 6 లక్షలు, 40 హెచ్‌పి 5 లక్షల రా వాటర్‌ తోడేవని... రానురాను వాటికి రిపేర్లు రావడంతో సామర్ధ్యం తగ్గి... వరదలు వచ్చిన సమయంలో పైకి తీయడం... వరదలు తగ్గిన తరువాత మళ్లీ యదాస్థానాల్లో పెట్టడం శ్రమతో కూడుకున్న పని అని అధికారులు మా దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఇదే విషయాన్ని గత వైకాపా పాలకుల దృష్టిలో పెట్టిన వారు ఏ మాత్రం పట్టించుకోలేదని దానివల్ల నగర ప్రజలు మంచినీటి సరఫరా విషయంలో ఇబ్బందులు పడ్డారన్నారు. కమిషనర్ తో తాను చర్చించి ఈ విషయాన్ని గత ప్రభుత్వ పాలకుల దృష్టిలో పెట్టమన్నారు. నగర ప్రజలకు నీటి సరఫరా విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు హెడ్‌ వాటర్‌ వర్క్స్‌ను నిత్యం పరిశీలిస్తున్నామని... అధికారులతో సమీక్ష చేస్తున్నామన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత నగర ప్రజల నీటి అవసరాలకు తగ్గట్టుగానే హెడ్‌ వాటర్‌ వర్క్స్‌లో పనులు చేపట్టడం జరుగుతోందన్నారు. అలాగే  నీటిని తోడేందుకు ఇప్పటి వరకూ వినియోగించిన 10 మోటార్ల సామర్ధ్యానికి తగ్గట్టుగా మార్పు చేయడం జరిగిందన్నారు. దానిలో భాగంగానే 150 హెచ్‌పి వర్టికల్‌ టర్బైన్‌ మోటార్‌ను ఏర్పాటు చేయించడం జరిగిందన్నారు. గంటకు 15 లక్షల లీటర్ల రా వాటర్‌ను తోడే సామర్ధ్యం దీనికి ఉందన్నారు. ఫ్లడ్‌ సమయాల్లో కూడా ఇది నిర్విరామంగా పని చేస్తుందన్నారు. గతంలో సబ్‌ మెర్సిబుల్‌ మోటార్లు ఉండేవి... నగర ప్రజల నీటి అవసరాలకు తగ్గట్టుగా రా వాటర్‌ను అవి తోడే సామర్ధ్యం లేనందున... అలాగే ఫ్లడ్‌ సమయాల్లో పని చేయకపోవడంతో ఈ 150 హెచ్‌పి వెర్టికల్‌ టర్బైన్‌ మోటార్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. స్థానిక నాయకులు నగరపాలక సంస్థ అధికారులు తదితరులు ఆయన వెంట ఉన్నారు.