నాగర్కర్నూల్ జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. లింగాల పోలీస్టేషన్లో యువకులకు శిరోముండనం చేయించడం కలకలం సృష్టిస్తోంది. ఓ కేసు విషయంలో ముగ్గురు యువకులకు పోలీస్ స్టేషన్కు పిలిపించిన ఎస్సై శిరోముండనం చేయించాడు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం నాగర్కర్నూల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతన్న యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చి ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా లింగాల పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని ఓ పెట్రోల్ బంకులో పెట్రోల్ విషయంలో యువకులు, సిబ్బంది మధ్య గొడవ జరిగింది. పెట్రోల్ బంక్ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు యువకులను పీఎస్కు తరలించారు. ముగ్గురు యువకుల్లో ఒకడు ఎస్సై ముందు నిల్చోని తల దువ్వడంతో ఆగ్రహంతో రగిలిపోయాడు. దీంతో ముగ్గురు యువకులకు శిరోముండనం చేయించాడు ఎస్సై జగన్. మరుసటి రోజు మనస్తాపంతో సదరు యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతన్ని గమనించిన కుటుంబసభ్యులు, స్థానికుల సాయంతో హుటాహుటీన నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా, ఈ ఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది.