- భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలి
- పుష్కరాల రేవులో లాకర్లను అందుబాటులో ఉంచాలి
- మరుగుదొడ్ల వినియోగానికి కేవలం రూ. 5 మాత్రమే వసూలు చేయాలి
- ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదేశం
- పుష్కరాల రేవు ఆకస్మిక తనిఖీ
రాజమహేంద్రవరం రానున్నది కార్తీక మాసమైనందున గోదావరి పుణ్య స్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా కావాల్సిన ఏర్పాటు చేయాలని నగర పాలక సంస్థ అధికారులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) ఆదేశించారు. పుష్కరాలరేవులో గోదావరి పుణ్య స్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు అరకొర సౌకర్యాలే ఉన్నాయని, భక్తుల కోసం రుడా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లాకర్లు సక్రమంగా ఇవ్వడం లేదని, మరుగుదొడ్ల వినియోగానికి రూ. 5 కాకుండా రూ. 10 వసూలు చేస్తున్నారని తదితర సమస్యలపై ఫిర్యాదులు వచ్చిన నేపధ్యంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గురువారం పుష్కరాల రేవును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడి స్వాములను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పై సమస్యలనే వారు విన్నవించడంతో నగర పాలక సంస్థ ఎంహెచ్‌ఓను పిలిచి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. లాకర్లు నిత్యం
అందుబాటులోకి తీసుకువచ్చి నామ మాత్రపు రుసుం వసూలు చేయాలని, అలాగే మరగుదొడ్ల వినియోగం నిమిత్తం రూ. 5 మాత్రమే వసూలు చేయాలని ఆయా రేట్లను సూచిస్తూ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్తీక మాసం సమీపిస్తున్నందున భక్తులకు ఇబ్బంది లేకుండా ఘాట్ల వెంబడి నది ఒడ్డున ఇసుక వేయించాలని సూచించారు. వ్యర్ధాలు ఒడ్డుకు రాకుండా చూడాలన్నారు. ఈ సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. స్థానిక నాయకులు యిన్నమూరి దీపు, శెట్టి జగదీష్, నిమ్మలపూడి గోవింద్, ఎంఎన్ రావు, మొకమాటి సత్యనారాయణ, బూరా రమణ తదితరులు ఆయన వెంట ఉన్నారు.