ముస్లిముల్లో గందరగోళం సృష్టించొద్దు.. వైఎస్‌ఆర్‌ షాదీ తోఫాపై షేక్‌ సుభాన్‌


 TV77 తెలుగు రాజమహేంద్రవరం:

నూర్ బాషా, దూదేకుల, పింజారి, మెహతర్ ముస్లిం సామాజిక వర్గాలకు వైఎస్సార్‌ షాదీ తోఫా వర్తింపు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఇంతియాజ్‌ ప్రకటన విడుదలం చేయడం ముస్లిం సామాజిక వర్గంలో గందరగోళం సృష్టిస్తోందని టీడీపీ నూర్ బాషా సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్  షేక్‌ సుభాన్‌ అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఇస్లాం మతాచారం ప్రకారం జీవనం సాగించే ముస్లింలందరికీ దుల్హన్ (షాదీ తోఫా)ను వర్తింపచేయడం జరిగిందన్నారు. ఓసిల్లో ఉన్న ముస్లింలు, బిసి-ఇ, బిసి-బి, బిసి-ఎలో ఉన్న ముస్లింలందరికీ పథకాన్ని వర్తించేలా టీడీపీ ఈ పథకం అమలు చేసిందన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న వైసిపి ప్రభుత్వం తాము బీసీ-ఎ కేటగిరీలో ఉన్న మెహతర్‌ ముస్లింలకు, బీసీ-బీ లోని దూదేకుల, నూర్‌భాషా ముస్లిం సామాజిక వర్గానికి వైఎస్‌ఆర్‌ తోఫాను వర్తింప చేస్తున్నట్టు ప్రకటించడం దారుణమన్నారు. తమ ప్రభుత్వం కొత్తగా వారిని గుర్తించి ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టు ప్రచారం చేసుకోవడం ముస్లింలలో అపోహలకు కారణం అవుతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ పథకాన్ని అన్ని వర్గాల్లో ఉన్న ముస్లింలకు అమలు చేయాలే తప్ప గందరగోళాన్ని సృష్టించడానికి ప్రయత్నించవద్దని సుభాన్‌ సూచించారు.