TV77 తెలుగు రాజమహేంద్రవరం:
కల్లుగీత కార్మికులకు జగన్ వరాల జల్లు
ఎక్స్ గ్రేషియా రూ.10లక్షలకు పెంపు
గౌడ శెట్టిబలిజ కార్తీక వన సమారాధనపై సీఎం జగన్ అభినందనలు
సీఎంకు కృతజ్ఞతలు తెలియజేసిన ఎంపీ భరత్
అల్ప సంతోషులైన కల్లుగీత కార్మికుల జీవన స్థితిగతులలో అనేక మార్పులు తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారని వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు. మంగళవారం రాత్రి ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గీత కార్మికుల సమస్యలు, వారి దుర్భర జీవన విధానం గూర్చి సీఎం దృష్టికి తీసుకువెళ్ళగానే ఆయన సానుకూలంగా స్పందించి తప్పక న్యాయం చేస్తానని హామీ ఇచ్చారన్నారు. అందులో భాగంగానే గీత కార్మికుల సంక్షేమంపై ప్రధాన దృష్టి సారించి, ఎక్స్ గ్రేషియా రూ.5 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచారని చెప్పారు. కల్లుగీస్తూ ప్రమాదవశాత్తు మరణచిన కార్మికులకు చెల్లించే ఈ పరిహారం కల్లుగీత కార్మికులకు పెద్ద భరోసాగా ఆయన అభివర్ణించారు. ఇందులో రూ.5లక్షలు వైఎస్సార్ బీమా ద్వారాను, మిగిలిన రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా రూపంలో ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. కల్లుగీత కార్మికుడు సహజ మరణం చెందితే అతని కుటుంబానికి వైఎస్సార్ బీమా పథకం ద్వారా రూ.5లక్షలు పరిహారం అందజేస్తుందని ఎంపీ భరత్ తెలిపారు. సుమారు లక్ష కుటుంబాలకు ప్రయోజనం కలిగేలా కల్లుగీత పాలసీ మార్గదర్శకాలు విడుదల చేయడం పట్ల ఎంపీ భరత్ హర్షం వ్యక్తం చేశారు. మద్యం నియంత్రణ విధానానికి అనుగుణంగా కల్లుగీత కార్మికుల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ పాలసీని 2022 నుండి 2027 వరకు అమలులో ఉండేలా నిర్ణయించినట్టు తెలిపారు. అలాగే కల్లు కిస్తీలను ప్రభుత్వం రద్దు చేయడం శుభపరిణామమని అన్నారు. రాష్ట్రంలో కల్లుగీత కార్మిక సొసైటీలు, గీచేవానికి చెట్టు పథకం కల్లుగీత కార్మికులకు ఎంతగానో మేలు చేస్తుందన్నారు. ప్రధానంగా కాలువ గట్లు, నదీ సాగర తీరాలను పటిష్టం చేస్తూ కల్లుగీతకు కావలసిన తాటి, ఈత చెట్లను సమృద్ధిగా పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందన్నారు. కల్లుగీత కార్మికులు జీవన స్థితిగతులను మెరుగుపర్చేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న సీఎం జగన్ కు రాష్ట్రంలోని కల్లుగీత కార్మికులు, వారి కుటుంబాలు ఎంతగానో రుణపడి ఉంటారన్నారు. భవిష్యత్తులో కల్లుగీత కార్మికులకు మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడానికి నిర్ణయించుకున్నట్టు సీఎం జగన్ తెలిపారని ఎంపీ భరత్ వెల్లడించారు. మొన్ననే రాజమండ్రి పుష్కర వనంలో గౌడ శెట్టిబలిజ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వన సమారాధనలో తాను ఏదైతే కల్లుగీత కార్మికుల కోసం చెప్పానో దానిని సీఎం జగన్ ఆచరణలో పెట్టి చూపించడం నిజంగా సంతోషదాయకమన్నారు. ఆ కార్తీక వన సమారాధన గూర్చి సీఎం జగన్ ప్రత్యేకంగా తనను అడిగి, అభినందనలు తెలియజేశారన్నారు. ఆ కార్యక్రమంలో తీసుకున్న నిర్ణయాలు, తీర్మానాలు సీఎం జగన్ కు వెంటనే పంపానని, అందుకు అనుకూలంగానే ఈ సంక్షేమ పథకాలు, ఎక్స్ గ్రేషియా పెంపు తదితర నిర్ణయాలు సీఎం జగన్ తీసుకున్నారని ఎంపీ భరత్ తెలిపారు.