TV77 తెలుగు రాజమహేంద్రవరం:
కొబ్బరి కాయ కొట్టి పనులు ప్రారంభించిన ఎంపీ భరత్
వచ్చే ఏడాది విజయదశమికి ఎఫ్ఓబీ పూర్తి కావచ్చు
ఎంపీ భరత్..
రాజమండ్రి నగరం నేషనల్ హైవే ప్రధాన సెంటర్ మోరంపూడి ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. గత పదిహేను రోజుల క్రితం పూర్వపు ఉభయ గోదావరి జిల్లాలో పలు నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి స్థానిక ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో వర్చువల్ విధానంలో ప్రారంభించిన విషయం విదితమే. కాగా విజయదశమి పర్వదినాన్న బుధవారం మోరంపూడి ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు ఎంపీ భరత్ కొబ్బరి కాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఇందుకు సంబంధించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఒక క్రేన్, మరో జేసీబీ వద్ద ఎంపీ భరత్, రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్, నగర పార్టీ అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్, పలువురు వైసీపీ నేతలు కొబ్బరి కాయలు కొట్టారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడుతూ వచ్చే విజయ దశమికి బహుశా పూర్తి స్థాయిలో మోరంపూడి ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనులు పూర్తి కావచ్చునన్నారు. మోరంపూడి నాలుగు రోడ్ల కూడలి వద్ద వందలాది వాహన ప్రమాదాలు, జరిగాయని, ఎంతో మంది మృత్యువాత పడ్డారన్నారు. గత టీడీపీ హయాంలో మంజూరైనా, నాయకుల అసమర్థత కారణంగా రద్దయిందన్నారు. తాను మోరంపూడి వద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జి అవసరాన్ని కేంద్రం దృష్టికి పదేపదే తీసుకువెళ్ళి శాంక్షన్ చేయించినట్టు తెలిపారు. ఈ వంతెనతో పాటు నగరంలో మరో అయిదు ఫ్లై ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్ సహకారంతో మంజూరు అయ్యేలా కృషి చేసినట్టు ఎంపీ భరత్ తెలిపారు.