TV77తెలుగు రాజమహేంద్రవరం :
జీవో నెంబర్ 15 వెంటనే రద్దు చేయాలి
కేబుల్ టీవీ రాష్ట్ర నాయకుల డిమాండ్
సోమవారం హోటల్ జగదీశ్వరి లో కేబుల్ ఆపరేటర్ల రాష్ట్ర నాయకుల సమావేశం జరిగింది. కేబుల్ ఆపరేటర్ కేబుల్ వైర్ లను విద్యుత్ స్తంభాలకు కట్టి తద్వారా తన కేబుల్ ప్రసారాలను ప్రజల ఇంటికి చేరవేస్తూ తమ మనుగడను కొనసాగిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కేబుల్ వ్యవస్థ పై పోల్ టాక్స్ విధానాన్ని జీవో నెంబర్ 15 ద్వారా రూపొందించింది. ఈ విధానాన్ని రద్దు చేయాలంటూ రాష్ట్ర నాయకులు ఈ సమావేశాన్ని నిర్వహించారు. గత 30 సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకులను భరించి తమ మనుగడను కొనసాగిస్తున్నామని అటువంటి తమకు ఇప్పటిదాకా ఏ ప్రభుత్వము ఏ విధమైన రాయితీలను ఇవ్వలేదని అన్నారు. అంతేకాక ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే కేబుల్ ఆపరేటర్ లపై పోల్ టాక్స్ విధానాన్ని అమలు చేయాలనుకోవడం అన్యాయమని అన్నారు. గత ప్రభుత్వం కూడా ఈ పోల్ ట్యాక్స్ ను కట్టాలని ఒత్తిడి చేసినప్పటికీ ఆపరేటర్ల విజ్ఞప్తి తో తాత్కాలికంగా వాయిదా వేసి కొంత ఊరట కల్పించారు అని అయితే ఇప్పటి ముఖ్యమంత్రి తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సమయంలో కేబుల్ ఆపరేటర్లు ముఖ్యమంత్రిని కలిసినప్పుడు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పోల్ టాక్స్ విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తామని మాట ఇచ్చారు అని మాటతప్పని మడమ తిప్పని వ్యక్తిగా తన మాటను నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యపై త్వరలో తమ సంఘ సభ్యులు ముఖ్యమంత్రిని కలిసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే తాము వినియోగదారుల వద్ద నుండి వసూలు చేసే 300 రూపాయల లో వివిధ రకాల ఖర్చులు పోగా అతి తక్కువ లాభాలతో మాత్రమే తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నామని వేరే మార్గం లేని పరిస్థితుల్లో తమ కుటుంబ పోషణ కోసం ఈ వ్యాపారంలో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నామని అన్నారు. గతంలో ఈ సమస్యను వినతి పత్రాల ద్వారా ప్రభుత్వ అధికారులు మరియు రాజకీయ నాయకులు దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ తాత్కాలికంగా వాయిదా పడటం కొంతకాలానికి సమస్య మళ్లీ మొదటికి రావటం పరిపాటిగా మారిందన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన మాటకు పూర్తి విరుద్ధంగా జీవోను విడుదల చేశారని అన్నారు. గత ప్రభుత్వం స్తంభానికి 15 రూపాయలు వసూలు గా రూపొందించిన పన్ను ఇప్పుడు ఫిబ్రవరి నుండి మూడు రెట్లు అధికంగా పెంపుదల చేసి గ్రామీణ ప్రాంతాల్లో 50 రూపాయలు గాను, పట్టణ ప్రాంతాల్లో 75 రూపాయలు గాను, కార్పొరేషన్ ప్రాంతాలలో 100 రూపాయలు గాను మార్చి జీవోను జారీ చేశారని అన్నారు. గత నెల నుండి సంబంధిత విద్యుత్ కార్యాలయాల నుండి కేబుల్ ఆపరేటర్లకు ఒత్తిడి మొదలైందని కొన్నిచోట్ల మరొక అడుగు ముందుకు వేసి అధికారులు కేబుల్ ఆపరేటర్ యొక్క కార్యాలయం కు సంబంధించిన కరెంట్ బిల్లు తో పాటు ఈ పోల్ టాక్స్ ను కూడా ఇతర చార్జీల పేరుతో కలిపి బిల్లు తయారు చేసి చెల్లించని పక్షంలో కరెంటు సర్వీసును తొలగిస్తామని ఒత్తిడి చేస్తున్నారని తెలియజేశారు. కృష్ణ మరియు కర్నూలు జిల్లాలో ఇప్పటికే ఈ రకమైన ఒత్తిడి మొదలైందని చెప్పారు. కేబుల్ టీవీ వ్యాపారాన్ని ఒక ఇండస్ట్రీగా గుర్తించి తమను అసంఘటిత కార్మికులుగా గుర్తింపు ఇచ్చి కేబుల్ రంగానికి చేయూతని ఇస్తామని చెప్పినప్పటికీ ఆ స్థాయిలో తమకు గుర్తింపు లభించకపోవడం బాధాకరమని అన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలందరినీ ఆదుకోవడంలో ముందుండే ముఖ్య మంత్రి కేబుల్ వ్యాపారం లో జీవనం సాగిస్తున్న సుమారు లక్ష కుటుంబాలను సైతం ఆదుకోవాలని అన్నారు. ఈ రకమైన పోల్ టాక్స్ విధానం మూలముగా తమ కుటుంబాలు రోడ్డున పడతాయని గుర్తు చేశారు. ఇప్పటికే మార్కెట్లోకి వివిధ రకాల కేబుల్ సంస్థలు అడుగుపెట్టడంతో తమ వ్యాపారం ప్రశ్నార్థకంగా మారిందని తమ జీవన శైలి అందకారంగా గోచరిస్తుంది అని అన్నారు. అప్పటి ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన ఆంధ్ర ప్రదేశ్ ఫైబర్ నెట్ ప్రజల్లోకి తీసుకు వెళ్ళే విధంగా కేబుల్ ఆపరేటర్ లను ప్రోచ్చహించి ఫైబర్ నెట్ ను ముందుకు తీసుకు వెళ్లేందుకు కృషి చేస్తున్న ఆపరేటర్లకు పోల్ టాక్స్ నుండి మినహాయింపు ఇస్తున్నట్లు రాతపూర్వకంగా హమీ ఇచ్చినప్పటికీ అవి చెల్లని చెత్త కాగితాల లాగే మిగిలిపోయాయని విద్యుత్ అధికారులకు అవి చూపిస్తున్నప్పటికీ చెల్లదంటూ పన్నులు కట్టాలని ఒత్తిడి చేస్తున్నారని తెలియజేశారు. ఈ సమస్యలన్నింటినీ ముఖ్యమంత్రి దృష్టికి పూర్తిస్థాయిలో తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని అంతేకాకుండా ఈ టాక్స్ విధానం మూలముగా పరోక్షంగా ప్రజలపై మరింత భారం పెరుగుతుందని అన్నారు. ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించకపోతే ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రజా ఉద్యమం తప్ప తమకు వేరే దారి లేదని తెలియజేశారు. ఈ సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ కేబుల్ ఆపరేటర్ల జాయింట్ యాక్షన్ కమిటీ, చైర్మన్ పసలపూడి సీతారామయ్య, నారాయణ, బుల్లెట్ బాబు, సమావేశం సమన్వయకర్త ఉప్పులూరి జానకి రామయ్య, 13 జిల్లాల కేబుల్ ఆపరేటర్ల రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు.