TV77తెలుగు రాజమహేంద్రవరం:
సంక్రాంతి కోడి పందేలను అరికట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం కోర్టుకు తెలిపినప్పటికీ ఆంక్షలు ఎక్కడా అమలు జరిగిన దాఖలాలు లేవు. కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలతోపాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ పందేల నిర్వహణకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధానంగా వందల కోట్ల రూపాయల బెట్టింగ్ జరిగే కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లోని నేతలు తెరవెనుక సూత్రధారులుగా వ్యవహరిస్తున్నారు. అధినాయకుల ఆశీస్సులతో స్థానిక నేతలు కోడి పందేల కోసం 'బరి'లను ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడ నగర నడిబొడ్డు ప్రాంతాలతోపాటు కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో పెద్ద పెద్ద బరిలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని పలుచోట్ల గురువారం భారీ వర్షం కురవగా, బరిలు తడవకుండా ప్రత్యేకంగా టార్పాలిన్లు వేయడం విశేషం. అకాల వర్షంతో మరికొన్ని చోట్ల బరిల ఏర్పాటుకు ఆటంకం కలిగినప్పటికీ, శుక్రవారం నుంచి పందేల నిర్వహణకు సిద్ధం చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. పోలీసుల ఆంక్షలు ఉన్నప్పటికీ, కోళ్లకు కత్తి కట్టాల్సిందేనని నిర్వాహకులు భీష్మిస్తున్నారు. పలు జిల్లాల్లో పోలీసులు బరిలను ట్రాక్టర్లతో ధ్వంసం చేసినప్పటికీ, ప్రత్యామ్నాయ బరిలను కూడా సిద్ధం చేసుకోవడం గమనార్హం. మరోవైపు చోటా మోటా నిర్వాహకులపైనే పోలీసులు బైండోవర్ కేసులు పెట్టి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణా జిల్లాలో విజయవాడ నగరం నడిబొడ్డున అధికార పార్టీకి చెందిన నేతల ఆధ్వర్యంలో బరి ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. నగర సమీపంలోని కొత్తూరు తాడేపల్లిలోని మామిడి తోటల్లో జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే సహకారంతో బరిని ఏర్పాటు చేస్తున్నారు. నూజివీడు, ఆగిరిపల్లి, హనుమాన్ జంక్షన్, అంపాపురం, విస్సన్నపేట, తిరువూరు, ఈడ్పుగల్లు, కైకలూరు, మండవల్లితోపాటు పశ్చిమ గోదావరిలోని కొప్పాక, సీసలి, భీమవరం, కాళ్ల, ఉండి, వెంప, పెదగరువు, కేశవరం ప్రాంతాలతోపాటు తూర్పు గోదావరిలో రాజమహేంద్రవరం, అమలాపురం, కాకినాడ రూరల్ ప్రాంతాల్లో పందేలకు అన్ని ఏర్పాట్లూ చేశారు. కోడి పందేలపై హైకోర్టు సీరియస్‌గా ఉందని, ఈసారికి పందేలు వేయొద్దని పోలీసులు నిర్వాహకులను కోరుతున్నారు. అయితే, సంక్రాంతి సంప్రదాయం ప్రకారం పండగ మూడు రోజులు పందేలు వేసి తీరతామని నిర్వాహకులు తేల్చి చెప్పేస్తున్నారు. కృష్ణా, గోదావరి జిల్లాల్లో శుక్రవారం (భోగి) నుంచే పందేలు జరగనుండగా, గతంలో మాదిరి కొన్నిచోట్ల పోలీసులు మధ్యాహ్నం వరకు పందేలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.