నలుగురు అరెస్ట్

 


TV77తెలుగు నెల్లూరు క్రైమ్ :

నెల్లూరు కోర్పొరేషన్‌, బుచ్చి నగర పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు, బార్లు మూసివేయడంతో సెబ్‌ అధికారులు అనధికార మద్యం విక్రయాలు, పొరుగు రాష్ట్రాల మద్యంపై దృష్టి సారించారు. సెబ్‌ జేడీ కె.శ్రీలక్ష్మి ఆదేశాలతో సెబ్‌ నెల్లూరు-1 ఇన్‌స్పెక్టర్‌ కేపీ కిషోర్‌ తమ సిబ్బందితో ఆదివారం ఉదయం నుండి సోమవారం వరకు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని పొరుగు రాష్ట్రాలకు చెందిన 168 మద్యం బాటిళ్లు, మూడు మోటార్‌సైకిళ్లను సీజ్‌ చేశారు. సెబ్‌ నెల్లూరు-1 స్టే షన్‌లో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఇన్‌స్పెక్టర్‌ కేపీ కిషోర్‌ ఈ పొరుగు రాష్ట్రం మద్యానికి సంబంధించి వివరాలు వెల్లడించారు. నెల్లూరు నగరంతో పాటు బుచ్చిరెడ్డిపాళెంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అనధికార మద్యం విక్రయాలపై దాడులు నిర్వహించాలని జేడీ కె.శ్రీలక్ష్మి ఆదేశించారు. దీంతో రెండు రోజుల పాటు ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాలలో దుకాణాలు మూసివేశారు. ఈ నేపథ్యంలో పలువురు చీకటి వ్యాపారస్తులు పొరుగు రాష్ట్రాల నుండి మద్యాన్ని ముందుగానే దిగుమతి చేసుకుని నిల్వ ఉంచి దుకాణాలు మూతపడగానే గుట్టుచప్పుడు కాకుండా మద్యం విక్రయాలకు తెరలేపారు. నగరంలోని పొర్లుకట్ట సుందరయ్య కాలనీ ప్రాంతంలో మద్యం విక్రయాలకు పాల్పడుతున్న ఎస్‌.అనీల్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 26 క్వార్టర్‌ మద్యం బాటిళ్లను స్వాధీనపరుచుకున్నారు. అనిల్‌ను సెబ్‌ అధికారులు విచారించి అతనిచ్చిన సమాచారంతో మైపాడు గేట్‌ సెంటర్లో పి.వెంకటేష్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి తెలంగాణ రాష్ట్రానికి చెందిన 32 క్వార్టర్‌ మద్యం బాటిళ్లు, మహారాష్ట్రకు చెందిన 20 క్వార్టర్‌ మద్యం బాటిళ్లను స్వాధీనపరుచుకుని విక్రయాలకు వినియోగిస్తున్న మోటార్‌సైకిల్‌ను స్వాధీనపరుచుకున్నారు.