సత్యనారాయణపురంలో కోడిపందేల స్థావరంపై దాడి


 TV77తెలుగు సత్తుపల్లిరూరల్‌ : 

సత్తుపల్లి మండలం సత్యనారాయణపురంలో కోడిపందేల స్థావరంపై పోలీసులు శనివారం దాడిచేశారు.  11ద్విచక్ర వాహనాలు, ఇద్దరు వ్యక్తులతో పాటు వారివద్ద నుంచి రూ.4,170నగదు, రెండు చొప్పున కోడిపుంజులు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ బాణోతు రామునాయక్‌ తెలిపారు. అయితే పోలీసులు వస్తున్నారనే సమాచారం తెలుసుకున్న నిర్వహకులు, పందెంరాయుళ్లు అక్కడి నుంచి పరారయ్యారు. గ్రామానికి చెందిన ఓ రైతుకు చెందిన పామాయిల్‌ తోటలో ప్రతిరోజూ రూ.లక్షల్లో పందేలు సాగుతుంటాయని, నిత్యం వాహనాల రాకపోకలతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నట్లు వాపోతున్నారు. సగానికి పైగా ఆంధ్రాకు చెందిన వారున్నట్లు తెలుస్తుండగా ద్విచక్ర వాహనాలపై పంట పొలాల నుంచి పారిపోతున్న క్రమంలో పట్టుబడిన వాహనాలను వదలి వెళ్లినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కోడిపందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.