దూసుకొస్తున్న గులాబ్ తుఫాను
iraila 26, 2021
TV77తెలుగు :ఈ తుఫాను పశ్చిమ వాయువ్య దిశగా గంటకు ఏడు కిలోమీటర్ల వేగంతో కదులుతోందని తెలిపింది. తూర్పు-ఆగ్నేయంగా ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 330 కి.మీ., కళింగపట్నానికి 440 కి.మీ.తూర్పుగా కేంద్రీకృతమై ఉన్నట్టు ఐఎండీ పేర్కొంది. దక్షిణ ఒడిశాలోని గోపాల్‌పూర్, ఉత్తర కోస్తాలో కళింగపట్నానికి సమీపాన తీరం దాటుతుందని హెచ్చరించింది.ఒడిశా,ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది.‘తుఫాన్ ప్రభావం ప్రధానంగా శ్రీకాకుళం,విజయనగరం,విశాఖపట్టణం జిల్లాలపై ఎక్కువగా ఉంటుంది. మిగిలిన కోస్తా జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. తీర ప్రాంతాల్లో గంటకు 75-95 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి.రాగల 24 గంటల్లో ఒడిశా, ఉత్తరాంధ్ర,ఉభయగోదావరి,దక్షిణ కోస్తా జిల్లాలతోపాటు తెలంగాణ,విదర్భ,ఛత్తీస్‌గఢ్,ఒడిశాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని’హెచ్చరించింది.ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో సముద్రపు అలల తీవ్రత పెరిగే అవకాశముందని, తుఫాను తీరాన్ని దాటే సమయంలో కళింగపట్నం ఆ పరిసర ప్రాంతాల్లో కచ్చా ఇళ్లు,పూరిళ్లు దెబ్బతినే ప్రమాదముందని అప్రమత్తం చేసింది.లోతట్టు ప్రాంతాల్లోకి సముద్ర నీరు చొచ్చుకొచ్చే ప్రమాదముందని హెచ్చరించింది.తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది.శ్రీకాకుళం,విజయనగరం, విశాఖ జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది.తీర ప్రాంతాల్లోని 59,496 మత్స్యకార కుటుంబాలు,లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 86 వేల మందిని సహాయ పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించింది.తీర ప్రాంతాల్లోని 76 మండల స్థాయి అత్యవసర ఆపరేషన్ కేంద్రాలు,145 బహుళ ప్రయోజన తుఫాను కేంద్రాలు,16 ఫిఫ్ ల్యాండింగు కేంద్రాలు,8 పర్యాటక ప్రాంతాలను రాష్ట్ర అత్యవసర ఆపరేషన్ కేంద్రానికి అనుసంధానించారు.విపత్తు నిర్వహణశాఖ అధికారులు ఏపీకి మూడు,ఒడిశాలకు 15 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను పంపించారు.