గొలుసు దొంగ అరెస్ట్ సొత్తు స్వాధీనం
iraila 12, 2021
TV77తెలుగు రాజమహేంద్రవరం:
మహిళ మెడలో బంగారు గొలుసును తెంచుకు పరారైన దొంగను మూడో పట్టణ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఆ మేరకు సెంట్రల్ డీఎస్పీ జె. వి. సంతోష్ ఏర్పాటు చేసిన పత్రికా సమావేశం లో వివరాలు తెలిపారు. స్థానిక దేవీచౌక్ ప్రాంతం లక్ష్మివారపు పేటలో నివసిస్తున్న పిల్లాడి రత్నావతి ఇంటికి ఈనెల 8వ తేదీ ఉదయం అగంతక యువకుడు వచ్చాడు. మంచినీళ్లు కావాలని అడిగాడు. ఆ సమయం లో ఆమె ఒంటరిగా వుంది. అది గమనించిన ఆయువకుడు అదను చూసి ఆమె మెడలో నాలుగున్నర కాసుల బంగారు గొలుసును తెంచుకుని పరారైయాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. అర్బన్ జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఆదేశాలమేరకు డీఎస్పీ జివి సంతోష్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ జి.మధు బాబు కేసు దర్యాప్తు చేశారు.విశ్వసనీయ సమాచారం మేరకు
ఎస్.ఐ. వై వి రామ్ మోహన్ రావు తన సిబ్బందితో కలిసి మల్లయ్య పేట పెట్రోల్ బంకు సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న కొల్లు రాము అనే యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం చేసినట్లు అంగీకరించాడు.అతడి స్వస్థలం రాజోలు మండలం కాట్రేనిపాడు గ్రామమని, ప్రస్తుతం రాజమహేంద్రవరం కోటిలింగాల పేట లో నివసిస్తున్నట్లు నిందిత యువకుడు తెలిపాడు.అతడినుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు.దాని విలువ రూ 72,000 ఉంటుందని పోలీసులు తెలిపారు నేరం జరిగిన 24 గంటల్లో వేగవంతంగా దర్యాప్తు చేసి దొంగను పట్టుకున్న ఇన్స్పెక్టర్ జి మధు బాబు,ఎస్ ఐ వై వి రామ్ మోహన్ రావు లను డి.ఎస్.పి సంతోష్ అభినందించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ అపరిచిత వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనబడితే 100కి సమాచారం అందించాలని కోరారు.