మండపేట పరిసర ప్రాంతాల్లో 17 మోటారు బైకులు స్వాధీనం డీఎస్పీ బాలచంద్రారెడ్డి

TV77తెలుగు మండపేట: మండపేట పరిసర ప్రాంతాల్లో మోటార్ సైకిళ్లు చోరీ జరిగితే వెంటనే ఫిర్యాదు చేయాలని రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి కోరారు. బుధవారం మండపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రతి రోజు వివిధ సెంటర్లలో సోదాలు నిర్వహిస్తున్నామని, అనుమానితులను గుర్తించి వారిని ఇంటరాగేట్ చేస్తుంటే వారు చేసిన నేరాలు తెలుస్తున్నాయని ఆయన అన్నారు. ఇటీవల జడ్ మేడపాడు సెంటర్లో వాహనదారులను తనిఖీలు చేస్తుంటే ముగ్గురు అనుమానితులను గుర్తించామన్నారు. వారిని ఇంటరాగేషన్ చేయగా వారు వివిధ ప్రాంతాల్లో మోటార్ బైక్ చోరీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది అన్నారు. వీటిలో అనపర్తిలో 4 బైకులు ఉన్నాయన్నారు. వీటిపై ఎఫ్ఐఆర్ లను పరిశీలిస్తే కేవలం నాలుగు మోటార్ సైకిల్ పైన ఎఫ్ఐఆర్ నమోదు అయ్యాయని ఆయన వివరించారు. మిగిలిన వాటిపై మోటారు సైకిళ్లు చోరీకి గురైనట్లు ఎక్కడ ఎఫ్ ఐ ఆర్ నమోదు కాలేదు అన్నారు. కావున మండపేట పరిసర ప్రాంతాల్లో మోటార్ సైకిళ్ళు చోరీకి గురైన వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కోరారు. తమ వద్ద ఉన్న 13 మోటార్ సైకిళ్లను పరిశీలించి వాటి యజమానులు సరైన పత్రాలు సమర్పిస్తే వాటిని కోర్టు ద్వారా అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు. మండపేటకు చెందిన ఏపుగంటి దుర్గాప్రసాద్, తొగర సురేష్, పెదపాటి మణికుమార్ లు ఈ దొంగతనాలు చేస్తున్నారని విచారణలో వెల్లడైందన్నారు. అదేవిధంగా అర్తమూరు గ్రామంలో ఇటీవల చోరీకి గురైన 3.50 లక్షల రూపాయలను నిందితుడితో సహా రికవరీ చేశామన్నారు. అర్తమూరు గ్రామంలో మన్నే లక్ష్మి నివాస గృహంలో 3.50 లక్షలు సొమ్ము, 8 గ్రాముల బంగారం చోరీకి గురైందని డిఎస్పీ వివరించారు. భర్త చేసిన అప్పులు తీర్చడానికి ఆమె స్థలాన్ని అమ్మి వచ్చిన డబ్బులు తన ఇంటిలో బీరువాలో దాచుకోగా ఆ డబ్బులు చోరీకి గురయ్యాయని ఆయన వివరించారు. ఆమె పోలీసులకు ఫిర్యాదు అనంతరం దర్యాప్తు ప్రారంభించామన్నారు. ఆమె ఇంట్లో పని చేసే పని మనిషి ఏరుకొండ సుబ్బలక్ష్మి ఈ డబ్బులు చోరీ చేసిందని ఆయన వివరించారు. ఈ కేసును మూడు రోజుల్లో అత్యంత చాకచక్యంగా పరిష్కరించిన సీఐ పెద్దిరెడ్డి శివ గణేష్, ఎస్ఐ శివ కృష్ణ, కానిస్టేబుల్లు నారాయణ, దుర్గాప్రసాద్ ఎస్పీ అభినందించారని డీఎస్పీ తెలిపారు.