తెలుగులో నేను ఇంత బాగా పాడటానికి కారకులు బాలుగారే: చిత్ర
abuztua 05, 2021
tv 77 telugu : తెలుగు పాటపై తేనె చిందించిన గాయని చిత్ర. కేరళలో పుట్టి పెరిగిన చిత్ర .. ఊహ తెలిసిన దగ్గర నుంచే సంగీతం పట్ల ఆసక్తిని కనబరిచారు. ఆ తరువాత కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందారు. మలయాళ సినిమాల్లో గాయనిగా ఆమెకు అవకాశాలు వచ్చాయి. ఆ సమయంలోనే ఆమెకు ఏసుదాసుతో పరిచయం ఏర్పడింది. మలయాళంలో పాడుతూ ఉండగా విని ఆమె స్వరంలో ఏదో కొత్తదనం ఉందని గ్రహించిన ఇళయరాజా ఆమెకి అవకాశం ఇచ్చారు.
మలయాళ .. తమిళ సినిమాల తరువాత తెలుగు సినిమాలవైపు ఆమె అడుగులు పడ్డాయి. తెలుగులో 'గీతాంజలి' సినిమాకు పాటలు పాడిన తరువాత ఇక చిత్ర కెరియర్ పరంగా వెనుదిరిగి చూసుకోలేదు. సుశీల .. జానకి తరువాత అంతటి అద్భుతమైన స్వరం చిత్ర సొంతమని గ్రహించడానికి ఎక్కువ కాలం పట్టలేదు. అప్పటి నుంచి తమిళ .. మలయాళ భాషాలతో పాటు తెలుగులోను ఆమె జోరు కొనసాగింది. సుశీల - జానకి తరువాత తెలుగు పాటను చిత్ర అలుముకున్నారు .. ఆదుకున్నారు.
తమిళ .. మలయాళ పాటలలో ఏసుదాసు నుంచి .. తెలుగు పాటల విషయంలో బాలు నుంచి ప్రశంసలు అందుకోవడం ఆమె ప్రత్యేకత. అలాంటి చిత్ర తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమం ద్వారా తనకి సంబంధించిన అనేక విషయాలను గురించి చెప్పుకొచ్చారు. "మా అమ్మానాన్నలు టీచర్లు .. అందువలన నాకు కూడా టీచర్ ను కావాలని ఉండేది. సంగీతం నేర్చుకుని సంగీతం పాఠాలు చెప్పుకోవచ్చును గదా అనే ఉద్దేశంతో సంగీతం నేర్చుకున్నాను. కానీ అనుకోకుండా ఈ రూట్లో వచ్చేశాను.
తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ .. ఒరియా .. బెంగాలీ .. పంజాబీ .. తుళు .. మొదలైన భాషల్లో పాడాను. అన్ని భాషల్లోను కలుపుకుని 20 వేలకి పైగా పాటలు పాడాను. తెలుగులో పాడే ఆవకాశం వచ్చినప్పుడు నాకు తెలుగు రాదు. తెలుగుని మలయాళంలో రాసుకుని పాడుతూ ఉండేదానిని. తెలుగు నుంచి అవకాశాలు పెరగడంతో అప్పుడు తెలుగు మాట్లాడటం .. చదవడం .. రాయడం నేర్చుకున్నాను. నేను తెలుగు నేర్చుకోవాలని అనుకున్నప్పుడు నాకు అక్షరాలు రాసిచ్చినదే బాలు గారు.
నేను తెలుగు ఇంతగా నేర్చుకోవడానికి ప్రధానమైన కారకులు బాలూగారే. పాటలోని పదాలు .. వాటి అర్థాలు .. ఆ భావాలను ఎలా ఎక్స్ ప్రెస్ చేయాలి అనేది బాలూగారు నేర్పించారు. ఆయనతో పడటం వలన నేను అనేక విషయాలు తెలుసుకున్నాను. నా కెరియర్ ఇంతకాలం కొనసాగడానికి బాలు గారు .. ఏసుదాసు గారు ఇద్దరూ కారకులేనని చెప్పాలి. నేను ఏసుదాసు గారిని 'దాసన్నా' అని పిలుస్తూ ఉంటాను. ఆయన కూడా నాకు పాటల్లో అనేక మెళకువలు నేర్పినవారే "అని చెప్పుకొచ్చారు.