తల్లి పాలు బిడ్డకు అమృతసమానం

TV 77 TELUGU : కొవిడ్‌ కాలం కొనసాగుతోంది. కొత్తగా తల్లయిన మహిళల్లో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగినులు ఉంటారు. ఇంటిపట్టునే వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నవాళ్లూ ఉంటారు. ఓ పక్క ఆఫీసు పని, మరో పక్క ఇంటి పని, ఇంకో పక్క బిడ్డ పోషణ. గంట గంటకూ బిడ్డ పాల కోసం ఏడుస్తూ ఉంటే వాడి ఆకలి తీర్చేదెలా? అసలు తానిచ్చే పాలు బిడ్డకు సరిపోతున్నాయా? రోజులో ఎన్ని సార్లు పాలివ్వాలి? ఇలాంటి సందేహాలతో కొత్తగా తల్లయిన మహిళలు అయోమయానికి గురవుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా కొవిడ్‌ సోకిన మహిళల్లో పాల ద్వారా బిడ్డకు ఇన్‌ఫెక్షన్‌ సోకుతుందేమోననే భయాలు ఎక్కువ. గర్భిణులు, పాలిచ్చే తల్లులకు కూడా వ్యాక్సిన్‌ అనుమతి లభించినా, బిడ్డకు పాలిస్తున్నంత కాలం వ్యాక్సిన్‌కు దూరంగా ఉండడమే మేలనే ఆలోచనతో ఉంటున్నారు. నిజానికి గర్భిణిగా ఉన్న సమయంలో వ్యాక్సిన్‌ తీసుకోగలిగితే, ప్రసవ సమయానికి కొవిడ్‌ సోకే పరిస్థితి తప్పుతుంది. కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకడం మూలంగా శరీరంలో తయారయ్యే యాంటీబాడీల కంటే వ్యాక్సిన్‌తో తయారయ్యే యాంటీబాడీల మోతాదు ఎక్కువ. గర్భిణులు వ్యాక్సిన్‌ తీసుకున్నప్పుడు, ప్లాసెంటా ద్వారా గర్భంలోని బిడ్డకు ఇవి చేరుకుంటాయి. పాలిచ్చే తల్లుల్లో చనుపాల ద్వారా ఇవి బిడ్డకు అందుతాయి. కాబట్టి గర్భిణులు, పాలిచ్చే తల్లులూ తప్పనిసరిగా వ్యాక్సిన్‌ వేయించుకోవాలి.