ఆంధ్ర ప్రదేశ్ లో 1000 కోట్ల పెట్టుబడి పెట్టనున్న కంపెనీ

ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. తాజాగా మరో కంపెనీ భారీ పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది. సెంచరీ ప్లై బోర్డ్స్‌ ఇండియా లిమిటెడ్‌ సీఎండీ సజ్జన్‌ భజంకా, ఈడీ కేశవ్‌ భజంకా, కంపెనీ ప్రతినిధి హిమాంశు షా.ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కడప జిల్లా బద్వేలులో సెంచరీ ప్లైబోర్డ్స్‌ ఇండియా లిమిటెడ్‌ కొత్త ప్లాంట్‌ ఏర్పాటు చేయనుంది. ఈ సందర్భంగా కంపెనీ ప్రణాళికలను సీఎం వైఎస్‌ జగన్‌కు వివరించి చర్చించారు. రైతులతో యూకలిప్టస్‌ తోటల పెంపును ప్రోత్సహించి, కొనుగోళ్లపై గిట్టుబాటు ధర కల్పన, ఆర్థికంగా రైతులకు చేయూతనిచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ప్లైఉడ్, బ్లాక్‌ బోర్డ్, మీడియం డెన్సిటీ ఫైబర్‌ బోర్డ్, పార్టికల్‌ బోర్డ్‌ల తయారీలో దేశంలోనే అత్యంత పెద్ద తయారీ పరిశ్రమగా ప్రత్యేక గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. సెంచరీ ప్లై బోర్డ్స్‌ ఇండియా కంపెనీ పశ్చిమ బెంగాల్, తమిళనాడు, హర్యానా, అసోం, గుజరాత్, పంజాబ్, ఉత్తరాఖండ్‌లలో ఇప్పటికే యూనిట్‌లు ఏర్పాటుచేసింది.ఏపీలో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో మూడు దశల్లో ప్రాజెక్ట్‌ నిర్మాణం, 3 వేల మందికి ప్రత్యక్షంగా, దాదాపు 6 వేల మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనుంది. ఈ క్రమంలోనే నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించి డిసెంబర్‌ 2022 కల్లా మొదటి దశ ఆపరేషన్స్‌ మొదలుపెట్టేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. ఈ ప్లాంట్‌ 2024 డిసెంబర్‌ వరకు మూడు దశల్లో పూర్తి కానుంది. ఏడాదికి 4 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తితో మొదటి విడత ప్రారంభించి మూడు దశలు పూర్తయ్యే సరికి 10 లక్షల మెట్రిక్‌ టన్నుల పూర్తి స్థాయి సామర్ధ్యంతో ప్లాంట్‌ సిద్ధం కానుంది. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ స్పెషల్‌ సీఎస్‌ ఆర్‌.కరికాల్‌ వలవన్‌ ఉన్నారు.